Thursday, April 16, 2009

ఎవరి దమ్ము ఎంత ? - శ్రీ శ్రీ

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు కాందహార్ సంఘటన ని ముంబై 26 /11 ని పోలుస్తూ ముంబై ఘటన వారి ప్రభుత్వం ఎంత సమర్ధ వంతంగా ఎదుర్కొన్నారో వివరిస్తూ కాందహార్ విషయం లో అప్పటి ప్రభుత్వం చాతగాని తనాన్ని విమర్శిస్తూ జబ్బలు చరుచుకొన్నారు మన పంజాబ్ సింహం. కానీ నా లాంటి సామాన్య సగటు భారతీయులకి అర్ధం కానీ విషయం ఏంటంటే అసలు కాందహార్ కి ముంబై 26 /11 కి పోలిక ఏంటి అని. అప్పటి కాందహార్ సంఘటన మన భూభాగం మీద జరగలేదు మన విమానాన్ని హైజాక్ చేసి తాలిబాన్ పాలిత కాందహార్ కి తీసుకొని వెళ్తే, భారత దేశం అమెరికా లా వెంటనే ప్రపంచ దేశాలని కూడా గట్టుకొని ఆఫ్గనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదని మన ప్రధానమంత్రి గారు గుర్తించ లేక పోవడం కడు శోచనీయం. అప్పటి కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ ఉగ్రవాదులని తీసుకొని తాలిబాన్ పాలిత కాందహార్ లో అడుగు పెట్టారు కానీ ఇప్పటి ప్రభుత్వం లో ఏ ఒక్క మంత్రి కానీ అంత ధైర్యం చెయ్యగలరా అని నా సందేహం. తీవ్రవాదం పై యుద్ధం అంటే రోజుకి నాలుగు లేద ఐతు జతల దుస్తులు మార్చడం కాదని మన గౌరనీయ ప్రధానమంత్రి గారు గుర్తించాలి. ఒకప్పుడు శ్రీ వీ.పీ సింగ్ గారి మంత్రి వర్గం లోని శ్రీ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారి పుత్రిక రత్నం ని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తే అప్పుడు కూడా పలు కారాగారాల్లో ఉన్న తీవ్రవాదులని విడిచి పెట్టారని మన ప్రధానమంత్రి గారికి గుర్తు లేదో లేదా రాజకీయనాయకులు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు సామాన్య ప్రజల ప్రాణాలకంటే ఎక్కువ కనుక ఆ విషయం పట్టించుకోలేదో మరి. అప్పటి ప్రభుత్వం తీవ్రవాదులని విడిచిపెట్టడం తప్పు అంటోన్న మన గౌరనీయ ప్రధానమంత్రి గారు కాని, మన యువరాజు శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ లేదా మన మహారాణి శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ ఆ సమయంలో వీరైతే ఏమి చేసే వారో సెలవిస్తే నా లాంటి సగటు భారటీయులు వీరంతా నిజంగా ఎంతో దమ్ము ఉన్న వారని గుర్తించి మరో సారి పట్టం కట్టేవారిమేమో. కాని మీరు ఏమి చేసివుండే వారో చెప్పకుండా వారు చేసింది తప్పు అని అంటే మీ సమర్ధతని ఎలా అంచనా వెయ్యగలం చెప్పండి.

అసలు ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రధానమంత్రి అబ్యార్దులైన మీరు మరియు శ్రీ అద్వాని గారు ఒక వేదిక పై చర్చిస్తే మీ ఇద్దరి దమ్ము ఏమిటి అనేది మాకు అర్ధం అయ్యేది కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా నేను మీలా మాటకరిని కాను అంటూ శ్రీ అద్వానీ గారి పిలుపుని తిరస్కరించారు. పోనీ మీ పార్టీలో మరియు ప్రభుత్వం లో ఎందరో మాటకారులైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, శ్రీమతి జయంతి నటరాజన్ గారు, శ్రీ కపిల్ సిబాల్ గారు వారిలో ఎవరినైనా అద్వాని గారితో చర్చకు పంపాల్సింది మరి. కానీ వంద కోటల జనాభా కి ప్రాతినిద్యం వహిస్తూ నేను మాటకరిని కాను అని మీరే అంటుంటే మీరు ప్రపంచ వేదికలపై భారత దేశ వాణిని ఎలా వినిపిస్తారు అని మమ్మల్ని అనుకోమంటారు ప్రధాన మంత్రి గారు. ఇప్పటికైనా మీరు భారత ప్రధాని అని, కేవలం గాంధీ రాజ వంశానికి కాదని గుర్తిస్తారని ఆశిస్తున్నా.
మీరు మరో చక్కని విమర్శ చేసారు అద్వాని గారి పై, బాబ్రీ మస్జిద్ కులిపోతుంటే ఒక మూల ఏడుస్తూ కూర్చున్నారని కానీ మూడు వేల మంది అమాయక సిక్కు ప్రాణాలు మీ పార్టీ ముష్కరుల కారణంగా గాలిలో కలిసిపోతుంటే అప్పుడు మీరు ఏమి చేస్తున్నారో అని నాలాంటి వారికీ సందేహం రావడం తప్పు కాదేమో. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు మూడు వేల అమాయక సిక్కు ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ పార్టీ సహచరులకి మీ నాయకత్వం లోని ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం మీ చేతలని మీ దమ్ముని ప్రదర్శిస్తుంది. మీది చాలా దమ్మున్న ప్రభుత్వం శ్రీ మన్మోహన్ సింగ్ గారు !!!! - శ్రీ శ్రీ

0 comments:

Post a Comment